పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
హైదరాబాద్, ఏప్రిల్ 21, 2017:
వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు సాధికారతను కలిగించడం నేటి తక్షణావసరం : కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ
- “అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి వెనుకబడిన తరగతులవారు ఒక్కటవ్వాలి’’
వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు సాధికారతను కలిగించడం నేటి తక్షణావసరమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ అన్నారు. వెనుకబడిన తరగతుల వారి కోసం ఒక జాతీయ కమిషన్ ను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన అభినందన సభలో శ్రీ దత్తాత్రేయ పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యదక్షుడైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్ డిఎ ప్రభుత్వం రాజ్యాంగ స్థాయితో కూడిన ఒక కొత్త జాతీయ కమిషన్ ను వెనుకబడిన తరగతుల వారి కోసం ఏర్పాటుచేయాలన్న చారిత్రక నిర్ణయం తీసుకొందని శ్రీ దత్తాత్రేయ అన్నారు. వెనుకబడిన తరగతుల వారు రాజకీయ సాధికారతను పొందాలంటే ఆ వర్గాలలోని మహిళల ప్రాతినిధ్యం చట్టసభలలో పెంపొందాల్సిన అవసరం ఉందని శ్రీ దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. యువతకు, మహిళలకు ఉద్యోగ కల్పన కోసం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 480 జాబ్ మేళాలను నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. నోట్ల చలామణీ రద్దు అంశాన్ని మంత్రి ప్రస్తావిస్తూ.. అవినీతిని, నల్లధనాన్ని నిరోధించడానికి ప్రభుత్వానికి ప్రజలు వారి అమూల్యమైన మద్దతును అందించారని చెప్పారు. బిసి ల సంక్షేమం కోసం వెనుకబడిన తరగతుల సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీ ఆర్. కృష్ణయ్య బాగా కృషి చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి ప్రశంసించారు. సమాజంలోని బలహీనవర్గాల వారికి, మరీ ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందినవారికి విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాల కల్పనకు ఎన్ డిఎ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇస్తోందని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా వెనుకబడిన తరగతుల సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి దిశగా తమ సంఘం పలు కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. బిసి కమిషన్ కు రాజ్యాంగబద్ధతను కల్పించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల కోసం ఏర్పాటుచేసే కొత్త జాతీయ కమిషన్ గురించి వివరించారు. కేంద్ర సమాచార-ప్రసార శాఖ, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మరియు పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన శాఖ మంత్రి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, పూర్వ ఎంపీ శ్రీ ఎల్. రమణ, తెలంగాణ విధాన సభ స్పీకర్ శ్రీ మధుసూదనాచారి, ఇంకా ప్రముఖ బిసి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***