పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
హైదరాబాద్, మార్చి 15, 2017
ఎన్ డిఎ ప్రభుత్వ మైలురాళ్లలో జిఎస్ టి ఒకటి:
డాక్టర్ డి. పురుషోత్తమ్, సేవా పన్ను విభాగం కమిషనర్
-జిఎస్ టి భారతదేశం ఆర్థిక ఏకీకరణకు బాట వేస్తుంది
-జిఎస్ టిపై మూడు రోజుల వర్క్ షాప్ హైదరాబాద్ లో ప్రారంభం
వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి) ఎన్ డిఎ ప్రభుత్వ మైలురాళ్లలో ఒకటి అని చెప్పవచ్చును. జిఎస్ టి పై హైదరాబాద్ లో మూడు రోజుల వర్క్ షాప్ బుధవారం ఆరంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో సేవా పన్ను విభాగం కమిషనర్ డాక్టర్ డి. పురుషోత్తమ్ పాల్గొని ప్రారంభోపన్యాసమిస్తూ, వ్యాపార వర్గాల వారు కొత్తగా అమలుకానున్న పన్ను విధానం గురించి భయపడనక్కరలేదన్నారు. ప్రస్తుత పన్ను చెల్లింపుదారుల వ్యవస్థ లో నుంచి సమాచారాన్ని జిఎస్ టికి మళ్లించడం జిఎస్ టి ఉమ్మడి పోర్టల్ ద్వారా సులువుగా సాధ్యపడుతుందని తెలిపారు. బహుళ లావాదేవీల భారాన్ని తగ్గించడం జిఎస్ టి ధ్యేయమని వివరించారు. సేవా పన్ను కమిషనరేట్ ఒక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి.జె. సుధాకర్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆర్థిక సంస్కరణలను అమలుపరిచేందుకు అనేక చర్యలు చేపట్టారన్నారు. వీటిలో భాగంగా ఆయన తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నల్లధనాన్ని వెలికితీయడంతో పాటు అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించిన నిర్ణయమని చెప్పారు. ప్రధాన మంత్రి తీసుకున్న మరొక నిర్ణయం జన్ ధన్, ఆధార్, మొబైల్ (జెఎఎమ్..జమ్) అని, ఇది నగదు రహిత లావాదేవీల భావనను పరిచయం చేసిందన్నారు. డిజిటల్ ఇండియా ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన మరొక కార్యక్రమం అని డాక్టర్ పి.జె. సుధాకర్ గుర్తు చేశారు.
జిఎస్ టి ప్రధాన అంశాలను గురించి పన్ను చెల్లింపుదారులకు డిప్యూటీ కమిషనర్ శ్రీ ఎన్. మొహమ్మద్ అలీ విశదీకరించారు. ఇప్పుడు ఉన్న విధానం నుంచి జిఎస్ టికి ఎలా మారవచ్చో ఆయన తెలియజేశారు. పన్ను చెల్లింపుదారులు వ్యక్తం చేసిన సందేహాలను సహాయక కమిషనర్ శ్రీ ఎమ్.వి.డి. ప్రణీత్ నివృత్తి చేశారు. అదనపు కమిషనర్ శ్రీ పి. ఆనంద్ కుమార్, సంయుక్త కమిషనర్ శ్రీ పి.డి. పులి లు కూడా ఈ వర్క్ షాప్ లో పాలుపంచుకున్నారు. హైదరాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్ లకు చెందిన పలువురు వ్యాపారులు, సాధారణ ప్రజలు ఉత్సాహంగా ఈ వర్క్ షాప్ నకు తరలివచ్చి, జిఎస్ టి విషయంలో తమకు ఉన్న అనుమానాలను గురించి వెలిబుచ్చగా ఉన్నతాధికారులు వాటికి సమాధానాలిచ్చి, ఆ సందేహాలను తీర్చారు. జిఎస్ టి పై అవగాహనను పెంపొందించేందుకు గాను ఉద్దేశించిన ఈ వర్క్ షాప్ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రజలు, వ్యాపారస్తులు ఈ కార్యక్రమానికి హాజరై తమకు కావలసిన కీలకమైన వివరణలను పొందవచ్చునని సేవా పన్ను కమిషనరేట్ స్పష్టం చేసింది.
***