పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
హైదరాబాద్, మార్చి 7, 2017
మహిళల కోసం గ్రామీణ వైద్య కళాశాల ఆలోచన:
కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ
-‘అవ్యవస్థీకృత రంగంలోని మహిళా శ్రామికులకు ఇఎస్ఐసి నుంచి అన్ని సదుపాయాలను కల్పించే దిశగా కసరత్తు’
-‘‘మహిళలకు నైపుణ్య శిక్షణను అందిస్తే వారి ఉపాధి సామర్థ్యం పెరగగలదు’’
మహిళలకు నైపుణ్య శిక్షణను అందిస్తే వారి ఉపాధి సామర్థ్యం పెరగగలదని కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతకు ఒక రోజు ముందు మంగళవారం నాడు హైదరాబాద్ లో‘విమెన్ అండ్ ఎంప్లాయబులిటీ- ఎంప్లాయ్ విమెన్: ఎన్ రిచ్ ఇండియా’ అంశంపై కార్మిక మరియు ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి హాజరై, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని ఎన్ డిఎ ప్రభుత్వం మహిళా శ్రామికులకు ఉద్యోగ భద్రతను, వేతన భద్రతను, సాంఘిక భద్రతను కల్పించేందుకు కంకణం కట్టుకుందని స్పష్టంచేశారు. మరీ ముఖ్యంగా అసంఘటిత రంగంలో శ్రమిస్తున్న మహిళల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల మహిళల కోసం వైద్య కళాశాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ఈ ప్రతిపాదనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ తో సంప్రదింపులు జరిగాయన్నారు. అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారిలో మహిళా శ్రామికుల సంఖ్యే ఎక్కువగా ఉందని మంత్రి ప్రస్తావిస్తూ, ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ఇఎస్ఐసి) సదుపాయాలను అన్నింటినీ అవ్యవస్థీకృత రంగంలోని మహిళా శ్రామికులకు కల్పించే దిశగా ఆలోచిస్తున్నామన్నారు. దీనిపై ఆరోగ్య శాఖతో, మహిళా, శిశు వికాస మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ దీనిపై సమ్మతిని తెలిపిందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను గురించి మంత్రి వివరిస్తూ, వ్యవసాయ రంగ శ్రామికులకు కనీస వేతనాన్ని రూ.232 నుంచి రూ.300కు పెంచడం, ప్రసూతి సెలవు సదుపాయాన్ని 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించడం, 43 కార్మిక చట్టాలను 4 కేటగిరీలుగా క్రోడీకరించడం, బిడ్డ తల్లులకు పని ప్రదేశాలలో శిశు సదనాల సౌకర్యాన్ని సమకూర్చడం, సమాన పారితోషికం చట్టానికి సవరణలు, వేతనాలను చెక్కుల రూపంలో అందజేయాలన్న నియమం వంటివి కొన్ని మాత్రమేనని పేర్కొన్నారు.
వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారిలో రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ) కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, సాంఘిక కార్యకర్తలు, వైద్యులు, న్యాయవాదులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులు ఉన్నారు. వారు మహిళల హక్కులు, పని ప్రదేశాలలో వారి సురక్ష- భద్రత, మహిళా సాధికారత, మహిళల్లో శారీరక- మానసిక స్వస్థత, స్త్రీ పురుష సమానత్వం, ఉద్యోగినుల పట్ల పురుషుల ఆలోచన సరళిలో మార్పు రావలసిన ఆవశ్యకత గురించి ప్రసంగించారు. సాంకేతిక విజ్ఞానం మహిళా ఉద్యోగులకు మేలు చేసే విధంగా ఉండేటట్లు చూడాలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధికల్పన శాఖ ఏర్పాటు చేసింది.
***