పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
ఎన్ డిఎ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలోనూ
రైల్వేల మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి:
కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభు
విశాఖపట్నం, జనవరి 27, 2017:
ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండున్నరేళ్ల పాలనలోనూ
రైల్వేల మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభు తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు, ప్రభుత్వం, ప్రయివేటు.. వీటన్నింటి మధ్య భాగస్వామ్యాలతోనే దేశం వృద్ధి చెందగలదని ఆయన అన్నారు. భారతదేశంలో చాలావరకు ప్రాజెక్టులు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) నమూనాలో కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి ఈ రోజు విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ లో సమర్ధ నాయకత్వం ఒక అతి పెద్ద ఆస్తిగా ఉందని, ఈ భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశంలో పలు దేశాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఒయులు కుదుర్చుకొంటాయని చెప్పారు. సకాలంలో సరైన ప్రదేశానికి వచ్చే పెట్టుబడి అభివృద్ధికి తోడ్పడగలదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడి ఆదర్శప్రాయంగా ఉండగలదని, ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ అనేక ప్రయోజనాలు కలిగి ఉందని మంత్రి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రైలు, రోడ్డు, గగనతల మార్గాల పరంగా పరిశీలిస్తే చక్కని అనుసంధాన సదుపాయాలను కలిగి ఉందని వివరించారు. మౌలిక సదుపాయాల రంగం ఎదుగుదలకు అవకాశాలు ఉన్న రంగమంటూ, ఈ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని గుర్తు చేశారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలిసీ అండ్ ప్రమోషన్, వాణిజ్య- పరిశ్రమల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కలిసి విశాఖపట్నంలో జనవరి 27, 28 తేదీలలో భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం 23వ సంచిక ను నిర్వహిస్తున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, కేంద్ర వాణిజ్య- పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి,కేంద్ర శాస్త్ర & సాంకేతికవిజ్ఞానం, భూ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి శ్రీ వై.ఎస్. చౌదరి లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశంలో రూ.7 ట్రిలియన్ లకు మించి విలువైన 400కు పైగా అవగాహనపూర్వక ఒప్పందాల (ఎంఒయు ల) పై సంతకాలు జరగగలవని అంచనా లున్నాయి. ఈ ఎంఒయులు ఏరో స్పేస్, రక్షణ, చమురు, సహజవాయువు, ఆటోమొబైల్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, శక్తి, ఖనిజాలు తదితర రంగాలలో కుదరగలవని భావిస్తున్నారు.
***