పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
ఎలక్ట్రానిక్, డిజిటల్ రూపంలో నగదుబదలీకరణ తక్షణావసరం:
విశాఖపట్నంలో వుడా చిల్డ్రన్స్ థియేటర్ ను ప్రారంభించిన కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణం , సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ ఎమ్.వెంకయ్య నాయుడు
‘నల్లధనం, అవినీతి అనే సవాళ్లను దేశం ఎదొర్కుంటోంది.
“ విశాఖపట్నంలో త్వరలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభం”
" వచ్చే వారం విశాఖపట్నంలో చలనచిత్రోత్సవం నిర్వహణ"
విశాఖపట్నం, డిసెంబర్ 17, 2016 :
కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు శనివారం నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో వుడా చిల్డ్రన్ ఎరీనాను, చిల్డ్రన్స్ థియేటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశం నల్లధనం, అవినీతి అనే సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. డబ్బును ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రూపాలలో బదలాయించడం తక్షణావసరమని ఆయన చెప్పారు. బాలల కోసం అనేక సంక్షేమ పథకాలను ఎన్ డి ఎ ప్రభుత్వం ఆరంభించిందని కూడా ఆయన తెలిపారు. వచ్చే వారం విశాఖపట్నంలో చలనచిత్రోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు తన ప్రారంభోపన్యాసంలో విశాఖపట్నం ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మణిమకుటంగా అభివర్ణించారు. వుడా చిల్డ్రన్స్ థియేటర్ భారతదేశంలోని అత్యుత్తమ థియేటర్ లలో ఒకటి, కలికితురాయి వంటిది అని ఆయన పేర్కొన్నారు. చిల్డ్రన్స్ థియేటర్ వినోదంతో పాటు, శాస్త్ర విజ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని, సాహిత్య కార్యక్రమాలను బహుళ ప్రచారంలోకి తీసుకు రావడానికి తోడ్పడగలుగుతుందని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి దోహదం చేయగలదని చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమలుచేసిన పెద్ద నోట్ల చెలామణి రద్దు నల్లధనాన్ని అరికట్టే ఉద్దేశంతో తీసుకువచ్చినదేనని, పేదలలోకెల్లా నిరుపేదలైన వారికి ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీని సమకూర్చడం కోసం కూడా ఇది ఉపయోగపడగలదన్నారు. పిల్లలు తల్లిని, మాతృదేశాన్ని, మాతృభాషను మరువకూడదని ఆయన వారికి బోధించారు. త్వరలో విశాఖపట్నంలో మూడు రోజుల పాటు చలనచిత్రోత్సవాన్ని నిర్వహించనున్నారని, ఇందులో భాగంగా అల్లూరి సీతారామ రాజు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, లోక మాన్య తిలక్, ఐ యామ్ కలామ్, ఇక్బాల్, సర్దార్, బోర్డర్, లగాన్, చక్ దే ఇండియా.. ఈ 9 దేశభక్తి చిత్రాలను ప్రదర్శించనున్నారని శ్రీ వెంకయ్య నాయుడు వివరించారు. త్వరలోనే విశాఖపట్నంలో కృషి విజ్ఞాన కేంద్రం కూడా ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, పలువురు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***