పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం, హైదరాబాద్
****
ఆర్థిక మంత్రిత్వ శాఖ, సంప్రదింపుల సంఘం 5వ సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ
డిజిటల్ లావాదేవీల వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం,
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) చర్యలు: మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ
ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సమాంతర యంత్రాంగంగా డిజిటల్ లావాదేవీలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 15, 2016
ఆర్థిక మంత్రిత్వ శాఖ, సంప్రదింపుల సంఘం 5వ సమావేశాన్నికేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. “షిఫ్ట్ టు డిజటల్ ట్రాన్సాక్షన్స్’’ అనే అంశంపై ఈ నిర్వహించిన ఈ సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో డిజిటల్ లావాదేవీలు అనేవి సమాంతర యంత్రాంగమే తప్ప ప్రత్యామ్నాయం కాదని మంత్రి అన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనేది నిజానికి తక్కువ నగదు వినియోగ ఆర్థిక వ్యవస్థ మాత్రమేనని, ఏ ఆర్థిక వ్యవస్థ పూర్తి నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా ఉండదని వ్యాఖ్యానించారు. నగదు వినియోగం ఎక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థ తనదైన సాంఘిక, ఆర్థిక భారాల్ని, పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం డిజిటలైజేషన్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు తీవ్ర కృషి చేస్తోందని మంత్రి అన్నారు.
డిజిటల్ లావాదేవీల వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వివిధ చర్యలను ఇప్పటికే చేపట్టాయని మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ తెలిపారు. గత వారంలో పెట్రోల్ / డీజిల్ కొనుగోలు చేసే వినియోగదారులు డిజిటల్ ట్రాన్సాక్షన్ విధానంలో చెల్లింపులు చేసినట్లయితే 0.75 శాతం రాయితీ పొందవచ్చని ప్రభుత్వం చేసిన ప్రకటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని మంత్రి అన్నారు. పెట్రోల్ పంపుల్లో పాత రూ. 500 నోట్లను డిసెంబర్ 2, 20016 తర్వాత స్వీకరించడం నిలిపివేసిన అనంతరం డిజిటల్ ట్రాన్సాక్షన్ విధానం ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ / డీజిల్ కొనుగోలు చేసిన వినియోగదారుల సంఖ్య 52 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. డిజిటల్ చెల్లింపుల విధానంలో హై లెవల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని రక్షణాత్మక చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
***