పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం
****
గోవాలో జరుగుతున్న 47వ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో మల్టీ మీడియా ఎగ్జిబిషన్ “ఆజాదీ 70 సాల్ – యాద్ కరో కుర్బానీ” ని ప్రారంభించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి
శ్రీ ఎం. వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ, నవంబర్ 21, 2016
గోవాలో జరుగుతున్న 47వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.)లో భాగంగా మల్టీ మీడియా ఎగ్జిబిషన్ “ఆజాదీ 70 సాల్ – యాద్ కరో కుర్బానీ” ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు ఈ రోజు ప్రారంభించారు. భారతదేశం స్వాతంత్య్రం పొంది 70 సంవత్సారాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్మరింపజేసే విధంగా రూపొందించిన సినిమాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు.
గోవాలోని పనాజీలో జరుగుతున్న 47వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం – 2016లో భాగంగా నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఈ మల్టీ మీడియా ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ – ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచిన సినిమాలు భారతీయ సైనికులు, ప్రజలు, స్వాతంత్య్ర సమయోధుల సేవలను గుర్తు తెచ్చే విధంగా రూపొందాయని, స్వాతంత్య్ర సంగ్రామానికి, స్వాతంత్య్రానంతరం జరిగిన వివిధ యుద్ధాల్లో వారు అందించిన సహాయ సహకారాలను స్మరించుకునే విధంగా ఈ చిత్రాలు జ్ఞప్తికి తెస్తాయన్నారు. సామాజిక రుగ్మతలైన అంటరానితనం, కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా నిర్మించిన వివిధ చిత్రాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం జరిగింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ 42 వేల కంటే ఎక్కువ చిత్రాలను రూపొందించి, ఒక విభిన్నమైన ప్రత్యేకతను సొంతం చేసుకొందని, దీంతోపాటుగా దేశభక్తిని ప్రతిబింబించే విధంగా నిర్మించిన చిత్రాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచడం జరిగిందని మంత్రి తెలిపారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి గొప్ప చరిత్ర ఉందని, దీనిని భారతీయ సినిమా అత్యద్భుతంగా వివిధ చిత్రాల ద్వారా తెరకెక్కించడం జరిగిందని మంత్రి అన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశ సంస్కృతిలో ఒక ప్రత్యేకత అని, భారతీయ సినిమాలు దీనిని ప్రతిబింబించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్.ఎఫ్.ఎ.ఐ. వెబ్ సైట్ ను కేంద్ర మంత్రి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ప్రారంభించారు.