పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము
***
హైదరాబాద్ లో నేడు అంతర్జాతీయ ఐంద్రజాలికుల సమ్మేళనం
‘ఛూమంతర్ మేజిక్ ఏషియా 2016’ ను
ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ
“ విద్య, ఆరోగ్యం ప్రాముఖ్యాన్ని గురించిన అవగాహనను మేజిక్ పెంపొందించాలి ”
హైదరాబాద్, నవంబరు 19, 2016 :
కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో ఈ రోజు అంతర్జాతీయ ఐంద్రజాలికుల సమ్మేళనం ‘ఛూమంతర్ మేజిక్ ఏషియా2016’ ను ప్రారంభించారు. తొలి అంతర్జాతీయ ఐంద్రజాలికుల సమ్మేళనాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, “ ఇంద్రజాలం ఒక అద్భుతమైన కళ ” అన్నారు. ఇంద్రజాలాన్ని ఒక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంగా ఉపయోగించుకోవాలని శ్రీ దత్తాత్రేయ చెప్పారు. విద్యకు, ఆరోగ్యానికి ప్రజలు ఇవ్వవలసిన ప్రాముఖ్యాన్ని గురించి వారిని జాగృతం చేయడం కోసం ఇంద్రజాలాన్ని ఒక సాధనంగా వినియోగించవలసిందంటూ అంతర్జాతీయ ఐంద్రజాలికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ అలీ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఇంద్రజాలం ప్రజలకు వినోదాన్ని పంచుతుందని, ఈ కళను ప్రాచుర్యం లోకి తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ (టిఎస్ఆర్ టిసి) చైర్మన్ శ్రీ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ, ఇంద్రజాలం నేర్చుకోవాలంటే నైపుణ్యం కావాలని, ఇది మానవ నేత్రాల కల్పనకు మించినటువంటిదని చెప్పారు. అభ్యాసంతో మాత్రమే ఈ కళలో సామర్ధ్యాన్ని,సమగ్రతను సాధించవచ్చని తెలిపారు. ఈ గొప్ప కళను దుర్వినియోగపరచవద్దని ఆయన ఐంద్రజాలికులను కోరారు. జపాన్, థాయ్ లాండ్, చైనా, ఇండొనేషియా తదితర పలు దేశాలకు చెందిన మెజీషియన్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***