పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము
***
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని, ప్రత్యేక ప్యాకేజీని, ప్రత్యేక ట్రీట్ మెంట్ ను అందిస్తున్న కేంద్రం : కేంద్ర సమాచార &ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు
- ‘ కేంద్రం రూ.2,25,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ఎ.పి.కి సమకూర్చుతోంది ’
- “ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కూడా ఎ.పి. కి మరిన్ని ప్రయోజనాలు ”
కాకినాడ, నవంబరు 4, 2016:
ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ట్రీట్ మెంట్, ప్రత్యేక సహాయం.. ఇలా ప్రతిదీ ప్రత్యేకంగా అందుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అనేక ప్రాజెక్టుల కోసం రూ.2,25,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని సమకూర్చిందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రత్యేక ప్యాకేజి ద్వారా ఆంధ్ర ప్రదేశ్ మరిన్ని ప్రయోజనాలు పొందనుందని కూడా ఆయన వెల్లడించారు. కేంద్రం వివిధ పథకాలు, ప్రాజెక్టుల అమలు కోసం రాష్ట్రానికి ఇప్పటికే రూ.1,65,000 కోట్లను మంజూరు చేసిందని ఆయన వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలన్నింటినీ కేంద్రం నిలబెట్టుకొంటుందని శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కు న్యాయం చేయడం ఒక రాజకీయ వచనబద్ధతే కాదని, అది కేంద్రం బాధ్యత కూడా అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొంటున్న చర్యల ద్వారా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రాష్ట్రానికి రాగలవని, ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు లభించగలవని శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 100 శాతం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని, ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు.
లోటు బడ్జెట్టుకు పరిహారం కింద రూ.22,000 కోట్లను 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందని, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్యకలాపాలను పటిష్టం చేయడం కోసం రూ.32,500 కోట్లను సైతం కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రూ.3,300 కోట్ల వ్యయంతో బొబ్బిలి లో నౌకాదళ వైమానిక స్థావరం ఏర్పాటు అవుతుందని, రూ.20,000 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో అతి త్వరలో మెడ్ టెక్ (MED TECH) సంస్థ ఏర్పాటు కానుందని ఆయన చెప్పారు. రూ.18,000 కోట్ల వ్యయంతో అంతర్వేది లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నౌకాదళ సంబంధ సంస్థలను అభివృద్ధి చేయడం కోసం కేంద్రం ఒక ప్రాజెక్టును చేపడుతుందని శ్రీ వెంకయ్య నాయుడు తెలిపారు. పెట్రో రసాయనాల కాంప్లెక్స్ అభివృద్ధి కోసం రూ.52,000 కోట్లను కేటాయించడమైందని పేర్కొన్నారు. కర్నూలు, అనంతపురం లలో సౌర విద్యుత్తు ప్లాంటులను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ మరియు పెట్రో కెమికల్ యూనివర్సిటీ ల స్థాపనకు, ఇంకా విశాఖపట్నం లోని హెచ్ పి సి ఎల్ యూనిట్ సామర్థ్య విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.1,22,000 కోట్లను పెట్టుబడి పెడుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.
కాకినాడ స్మార్ట్ సిటీకి మొదటి సంవత్సరంలో రూ.200 కోట్లు, ఆ తరువాతి కాలంలో ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల వంతున కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా సమకూర్చనుందని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద తీర్చిదిద్దే తొలి 20 నగరాల జాబితాలో విశాఖపట్నం తో పాటు కాకినాడ పేరు కూడా ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ప్రతి ఒక్క నగరాన్ని ఒక స్పెషల్ వెహికిల్ ప్రాజెక్టు (ఎస్ పి వి) ద్వారా అభి వృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
దేశవ్యాప్తంగా మంజూరు అయిన 9.3 లక్షల గృహాలలో 1,93,142 గృహాలను ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించడం జరిగింది అని శ్రీ వెంకయ్య నాయుడు తెలిపారు. నంద్యాల-యర్రగుంట్ల, కాకినాడ-నర్సాపూర్ ల మధ్య చిరకాలంగా పెండింగులో ఉన్న రైలు మార్గాల నిర్మాణ పథకాలను పూర్తి చేసే దిశగా కేంద్రం అనేక చొరవలను తీసుకున్నట్లు శ్రీ వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రైలు మార్గాల అభివృద్ధి, ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీర్చిదిద్దడంపై కేంద్రం దృష్టి పెట్టిందని, ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే పలు ఎస్ ఇ జడ్ లు కూడా ఏర్పాటు కానున్నాయని కేంద్ర మంత్రి వివరించారు.
సానుకూలమైన కార్యక్రమాలు, అభి వృద్ధిలపై కేంద్రం శ్రద్ధ తీసుకొంటోందని కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. ‘ ప్రధాన మంత్రి సడక్ యోజన ’ లో భాగంగా దేశంలోని ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించడం కోసం కేంద్రం కంకణం కట్టుకొందని ఆయన అన్నారు. ఐఐఐటి, ఎన్ ఐ టి, ఐఐఎమ్, ఎఐఐఎమ్ఎస్, పెట్రోలియమ్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్, మారిటైమ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ టెక్నాలజీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. పెట్రోలియమ్ యూనివర్సిటీ భారతదేశంలోనే మొట్టమొదటిది అని ఆయన అన్నారు.
‘ స్వచ్ఛ భారత్ ’ లక్ష్య సాధన కోసం ఇప్పటి వరకు 4.17 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయినట్లు శ్రీ వెంకయ్య నాయుడు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో 117 మున్సిపల్ టౌన్ లను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా (ఒడిఎఫ్) ప్రకటించడం జరిగిందని ఆయన చెప్పారు. దేశంలోనే విద్యుత్తు కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు. స్కిల్, స్కేల్, స్పీడ్.. ఈ మూడూ దేశంలో నిలకడ కలిగిన అభివృద్ధి సాధనకు అత్యంత కీలకమైన అంశాలు అని శ్రీ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కేంద్రం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం తన పౌరులకు 24 గంటలూ విద్యుత్తును సరఫరా చేయగలుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంలో కేంద్రం తోడ్పాటును అందివ్వగలదని కేంద్ర మంత్రి అన్నారు. విజయవాడ నగరంలో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్టుకు, ఇంకా గుంటూరు నగరంలో భూగర్భ జల పథకానికి గాను తన మంత్రిత్వ శాఖ రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తుచేశారు. బిజెపి నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అవినీతికి తావు లేని ప్రభుత్వాన్ని అందించిందని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు.
***