పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము
***
కంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నామ్ లలో భారతీయ ఆర్థిక ఉనికి ఆకస్మికంగా మారేటట్లు ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిధిని ఏర్పాటుచేయడానికి మంత్రిమండలి అనుమతి
కంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నామ్ లలో భారతీయ ఆర్థిక ఉనికి ఆకస్మికంగా మార్పు చెందేటట్లు రూ. 500 కోట్ల రూపాయల మూలనిధితో ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిధి (పిడిఎఫ్)ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. పి డి ఎఫ్ వాణిజ్య విభాగం కింద ఉంటూ ఇ ఎక్స్ ఐ ఎమ్ బ్యాంక్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వాణిజ్య కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే అంతర్ మంత్రిత్వ శాఖల సంఘం అధీనంలో పి డి ఎఫ్ విధులు నిర్వహిస్తుంది.పూర్వరంగంసి ఎమ్ ఎల్ వి దేశాలైన కంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నామ్ లకు ప్రాంతీయ వాణిజ్య విపణులలో ఒక విశిష్ఠ స్థానం ఉంది. ఇవి వేరువేరు వాణిజ్య ఒప్పందాల పర్యవసానంగా చైనాకు ఈయూకు తదితర విపణులకు మార్కెట్ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఈ దేశాలతో ఇండియా సాన్నిహిత్యం కుదుర్చుకోవడం వల్ల భారతీయ ముడి పదార్థాలకు, ఇంటర్మీడియట్ గూడ్స్ కు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడడమే కాకుండా భారతీయ పారిశ్రామిక రంగానికి అవసరమైన ముడి సరుకును, ఇన్ పుట్స్ సైతం సమకూరేందుకు ఒక వనరు దీర్ఘకాలికంగా అందుబాటులోకి రాగలదు. సి ఎమ్ ఎల్ వి ప్రాంతంలో అవకాశాలు అపారంగా ఉన్నప్పటికీ, ఈ దేశాలలో భారతీయ వ్యవస్థాపకుల ప్రయత్నాలు ఇంతవరకు పరిమిత సమాచారం, అవస్థాపన ఇతర ఆకస్మిక రిస్కుల కారణంగా కొద్ది స్థాయిలోనే ఉంటున్నాయి. పి డి ఎఫ్ స్థాపనతో భారతీయ పారిశ్రామిక వర్గం వ్యాపార విస్తరణకు తక్కువ ఖర్చుతో కూడిన సరఫరా వ్యవస్థలకు అలాగే, ప్రపంచస్థాయి నిర్మాణ నెట్ వర్క్ లకు చేరువ కాగలుగుతుంది.***