పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం
*****
భటిండాలో కొత్త ఎయిమ్స్ (ఎ ఐ ఐ ఎమ్ ఎస్) ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం
పంజాబ్ లోని భటిండా లో ఒక కొత్త ఎ ఐ ఐ ఎమ్ ఎస్ (ఎయిమ్స్)ను ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పి ఎమ్ ఎస్ ఎస్ వై) లో భాగంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ సంస్థలో 750 పడకల సామర్థ్యం కలిగిన ఒక ఆసుపత్రిని నెలకొల్పుతారు. ఈ ఆసుపత్రిలో అత్యవసర విభాగం/ట్రామా పడకలు, ఆయుష్ పడకలు, ప్రైవేటు పడకటు, ఐ సి యు స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ పడకల సౌకర్యం ఉంటుంది. ఇంకా ఒక పరిపాలన భవనం, ఆయుష్ భవన సముదాయం, సభా భవనం, రాత్రిపూట ఆశ్రయవసతి, వసతి గృహాలు మరియు నివాస సదుపాయాలు కూడా ఉంటాయి. భటిండాలో కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు రూ.925 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఇందులో వేతనాలు, జీతాలు, నిర్వహణ వ్యయాల వంటి పునరావృత్త ఖర్చులను కలపలేదు. ఈ పునరావృత్త వ్యయాలను ఆయా ఎయిమ్స్ సంస్థలే వాటి వార్షిక బడ్జెటు లో నుండి భరిస్తాయి. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు చెందిన పి ఎమ్ ఎస్ ఎస్ వై ప్రణాళికా బడ్జెటు పద్దు నుండి గ్రాంట్- ఇన్- ఎయిడ్ రూపంలో ఈ వార్షిక బడ్జెటులను సమకూరుస్తారు. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సంరక్షణను భటిండా లోని కొత్త ఎయిమ్స్ సమకూర్చుతుంది. దీనితో పాటే జాతీయ ఆరోగ్య అభియాన్ (ఎన్ హెచ్ ఎమ్) కింద ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయి చికిత్స సదుపాయాలను అందించడానికి వైద్యులు, ఇంకా ఆరోగ్య కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో లభించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ సంస్థ ఈ ప్రాంతంలో వ్యాపిస్తున్న క్షేత్రీయ రోగాలు, తదితర స్వాస్థ్య సమస్యలపైన పరిశోధనలను కూడా నిర్వహిస్తుంది. అటువంటి వ్యాధులను ఉత్తమమైన పద్ధతిలో నియత్రిస్తూ, అటువంటి రోగాలను నయం చేయాలనేది దీని ధ్యేయం. భారత ప్రభుత్వం అనుమతి లభించిన నాటి నుండి 48 నెలల కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు. ఇందులో నిర్మాణానికి ముందు చేపట్టే కార్యకలాపాలకు 15 నెలలు , నిర్మాణ పనులకు 30 నెలలు, స్థిరీకరణ/ ఆరంభ సంబంధ కార్యకలాపాలకు మరో 3 నెలలు పడుతుంది. పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఎయిమ్స్ ప్రయోజనాలను అందుకుంటారు. పూర్వ రంగం :కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పి ఎమ్ ఎస్ ఎస్ వై) ను తొలుత 2003 ఆగస్టు నెలలో ప్రకటించారు. దేశంలో ఖర్చులను భరించగలిగే స్థాయిలో/ విశ్వసనీయమైన మూడో స్థాయికి చెందిన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రాంతీయంగా నెలకొన్న అసమానతలను తొలగించాలనే ఉద్దేశంతో ఎయిమ్స్ లను పి ఎమ్ ఎస్ ఎస్ వై లో భాగంగా నెలకొల్పుతూ వస్తున్నారు. సేవలు తగినంత స్థాయిలో లేని రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా వెనుకబడిన రాష్ట్రాలలో నాణ్యమైన వైద్య విద్యను బోధించే సదుపాయాలను పెంచేటందుకు సైతం ఎయిమ్స్ ను స్థాపించాలని లక్షించారు. ఈ పథకంలో భాగంగా ఎయిమ్స్ లను భువనేశ్వర్, జోధ్‌పూర్, రాయ్‌పూర్, రుషికేశ్, భోపాల్ మరియు పట్నా లలో ఏర్పాటు చేశారు. మరో పక్క రాయ్‌బరేలీలో ఎయిమ్స్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అంతే కాకుండా, నాగ్ పూర్ (మహారాష్ట్ర), కల్యాణి (పశ్చిమ బెంగాల్), గుంటూరు లోని మంగళగిరి (ఎ.పి.)లలో 3 ఎయిమ్స్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు 2015లోనే ఆమోదం తెలిపారు. ***