పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం
హైదరాబాద్
తేది: 01.07.2017
రైతు సంక్షేమార్థం ఎరువులపై పన్ను తగ్గింపు
- దేశవ్యాప్తంగా 50 కిలోల బస్తా రు.295.47కే
- అంతర్రాష్ట్ర స్మగ్లింగ్‌కి అడ్డుకట్ట
- ఏకీకృత ఎరువుల మార్కెట్ అవతరణ
- రు. 1261 కోట్ల మేర వ్యవసాయదారులకు లబ్ది
- కేంద్రమంత్రి శ్రీ అనంతకుమార్
వ్యవసాయదారుల సంక్షేమార్థం ఎరువులపై జిఎస్టి పన్నురేటును 12% నుండి 5%కి తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి శ్రీ అనంతకుమార్ ప్రకటించారు. జూన్ 30వ తేదీన జరిగిన జిఎస్టి కౌన్సిల్ 18వ సమావేశ వివరాలను ఆయన వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువులపై పన్ను తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నామని, ఈ తగ్గింపు ఎరువుల ఉత్పత్తిదారులు రైతులకి అందించేలా తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు. జిఎస్టితో రైతులకు 1261 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరించారు. టన్ను ఎరువు విలువ గతంలో 5923 రూపాయలు ఉండగా తాజా జిఎస్టి రేట్ల ప్రకారం ఈ విలువ5909 రూపాయలకు దిగిరానుంది (యాభై కిలోల బ్యాగ్ ధర రు.296.18 నుంచి రు.295.47కు తగ్గనుంది.)
కేవలం సహజవాయువు మీద అదనపు వ్యాట్ విధింపు ఉన్న 2 రాష్ర్టాలు మినహా, ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటాయని ఆయన వివరించారు. సహజవాయువుని జిఎస్టి పరిధిలోకి తీసుకరానందున ఈ రాష్ర్టాల్లో కొత్తధర వర్తించదని అయినప్పటికీ ఒక్కొక్క యాభై కిలోల బ్యాగ్‌పై కనీసం మూడు రూపాయలు తగ్గింపు ఉంటుందని చెప్పారు. ఇదేవిధంగా పాస్ఫరస్, పొటాషియం ఎరువుల ధరలు కూడా సరాసరిన దిగివస్తాయన్నారు. వీటిపై ప్రస్తుతమున్న పన్నులతో పోలిస్తే జిఎస్టి వ్యవస్థలో తక్కువ పన్ను పడనుందన్నారు. మొత్తం ఎరువుల మార్కెట్‌ను జిఎస్టి ఒక ఏకీకృత మార్కెట్‌గా మారుస్తుందన్నారు. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్రాలమధ్య ధరల్లో తేడాల కారణంగా జరుగుతున్న స్మగ్లింగ్ అంతరించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకేదేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను అనే ప్రధాని మోదీగారి దార్శనికతను జిఎస్టి కార్యరూపంలోకి తీసుకువస్తుందన్నారు.
***